UPDATED 14TH MAY 2017 SUNDAY 3:00 PM
పెద్దాపురం: బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక రామారావుపేటలో ఉన్న బ్రాహ్మణ కల్యాణమండపంలో సంఘ అధ్యక్షుడు అడవి మురళీ మోహన్ అధ్యక్షతన పెద్దాపురం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుపై ఇచ్చిన హామీని అమలు చేశారని పేద బ్రాహ్మణ కుటుంబాల వారికి ఆర్ధిక సహాయం అందించేందుకు కార్పొరేషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే దీని చైర్మన్ గా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కృష్ణారావును చైర్మన్ గా నియమించారని మంత్రి పేర్కొన్నారు. పేద బ్రాహ్మణులను గుర్తించి కార్పొరేషన్ ద్వారా స్కాలర్ షిప్ లు, వ్యాపారాలకు రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని, అలాగే పింఛన్ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్పొరేషన్ కు ముందుగా రూ.500 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి దశల వారీగా బడ్జెట్ ను విడుదల చేయడం జరుగుతుందన్నారు. అనంతరం హోం మంత్రిని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గంలోని పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి చెక్కులను అందచేశారు. ఈ కార్య క్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వూరి సురేష్, డొక్కా నాథ్ బాబు, రాణి శ్రీనివాస్, ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కురుపూరి రాజు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము) కందుల విశ్వేశ్వరరావు టిడిపి పట్టణ, అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్ ఎ ఎల్ వి నాగమణి, చీమలకొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







