UPDATED 13th JUNE 2026 4:00 PM
తుని, కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా తుని మండలం సి.హెచ్. అగ్రహారంలో కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఒక విషాదకరమైన, ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు అత్యంత కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క హఠాత్తుగా మృతి చెందింది.
చిన్నారి ఆచూకీ కనుగొనడంలో భాగంగా పోలీసులు పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker) అమర్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ కుక్క కేవలం 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర పలు అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా సంచరించింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంది.
పోలీసులకు ఎదురుదెబ్బ: నిన్నటి నుండి ఎలాంటి ఆహారం తీసుకోని ఆ పెంపుడు కుక్క, ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా నిలిచిన కుక్క మరణించడంతో పోలీసుల విచారణకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
కొనసాగుతున్న గాలింపు చర్యలు:
పెంపుడు కుక్క మృతి చెందినప్పటికీ, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు తమ గాలింపును ముమ్మరం చేశారు. అన్ని అనుమానాస్పద కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.







