పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు లోక సంరక్షణార్థం, కరోనా నిర్మూలన కోసం తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయ సన్నిధిలో అత్యంత వైభవంగా ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం గురువారం నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు ఆధ్వర్యంలో ఋత్విక్కులు వేదాంతం గోపాలాచార్యులు, వాడపల్లి సీతారామాచార్యులు, ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు, అంగర పార్ధసారధి పర్యవేక్షణలో ధన్వంతరి హోమం, ఆయుష్ హోమం పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విష్వక్సేన పూజ, కలశారాధన, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా నిర్వహించి, అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, చైర్మన్ బుద్ధాల వీరవెంకట రమణ, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







