Updated 15th May 2023 Monday 12:50 pm
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి 100వ రోజుకు చేరింది. నంద్యాల జిల్లా (Nandyala District) శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగింది. 100వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్.. బోయరేవుల క్యాంప్‌సైట్ నుంచి బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రం వరకు దాదాపు 12కి.మీ మేర పాదయాత్రలో పాల్గొన్నారు.
లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి ..
యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకోవడంతో లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొన్నారు. భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు యాత్రలో పాల్గొని లోకేశ్ వెంట ముందుకు సాగారు. నారా భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొనడంతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పాదయాత్ర ప్రాంతం జాతరను తలపించింది.
పాదయాత్ర వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. లోకేశ్ వెంట భువనేశ్వరి నడుస్తున్న క్రమంలో ఆమె షూ లేస్ ఊడటాన్ని గమనించిన లోకేశ్ తన చేతులతో తల్లి షూ లేస్‌లు కట్టారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా గుమ్మికూడారు. పాదయాత్ర సందర్భంగా బోయరేవుల క్యాంప్ సైట్, మోతుకూరు పరిసరాల్లో మూడు కిలో మీటర్లుమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.







