UPDATED 28th APRIL 2018 SATURDAY 9:00 PM
పెద్దాపురం: రోడ్డు ప్రమాదాలను నివారించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మహారాణి కళాశాల హాస్టల్ ఆవరణలో 29వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో హోంమంత్రి చినరాజప్ప ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. డ్రైవర్లు నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. డ్రైవర్లు తమ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడ కాపాడవలసిన బాధ్యత ఉందని, డ్రైవింగు చేసే సమయంలో ఏకాగ్రత కోల్పోతే ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. హెల్మెట్ ను ధరించడం, తక్కువ వేగంతో వాహనాన్ని నడపడం, మద్యం సేవించకుండా ఉండటం, డ్రైవింగులో సెల్ ఫోన్లు ఉపయోగించకుండా డ్రైవింగు చేయడం, తదితర అంశాలను గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతీ సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు ద్వారా ప్రజల్లో ప్రమాదాలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రవాణాశాఖ ప్రత్యేకంగా డ్రైవర్లకు శిక్షణ ఇప్పించాలని మోటారు వాహన ఇన్ స్పెక్టర్ ని మంత్రి ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ వాహన వేగం పరిమితం చేసినపుడు ప్రమాదాలను నివారించవచ్చని డ్రైవర్లు గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలు డ్రైవింగుకు సంబందించిన రూల్సును తూచా తప్పకుండ పాటించాలని తెలిపారు. అనంతరం రహదారి భద్రతావారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గూడా డైరెక్టర్ ఎలిశెట్టినాని, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, ఆటో యూనియన్ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







