రాజానగరం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: న్యూస్‌టుడే: డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. రాజానగరం సీఐ ఎం.వి.సుభాష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. కంచిబొట్ల నాగ సాయి అలియాస్ సాయి వెంకటేష్(25), సాయి పవన్ స్నేహితులు. పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ అనాథలు కావడంతో కొన్నాళ్లుగా కోలమూరులో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయి పవన్ తన సంపాదనను స్నేహితులతో కలిసి దుబారా చేస్తుండటంతో సాయి వెంకటేష్ తరచూ మందలిస్తుండేవాడు. దీంతో అతడిపై పవన్ పగ పెంచుకున్నాడు. నాలుగైదురోజుల కిందట స్నేహితుల సాయంతో సాయి వెంకటేష్‌ను హత్యచేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. వీలు కాకపోవడంతో శుక్రవారం రాత్రి గదిలోనే మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఆ గది వద్దకు వెళ్లగా.. లోపల ఉన్న పవన్, అతని స్నేహితులు సగం కాలిన మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో పడేసి పారిపోయారు. పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.







