UPDATED 9th JUNE 2017 FRIDAY 2:00 PM
పెద్దాపురం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహిస్తున్న వేసవి వినోదం కార్యక్రమం శుక్రవారంతో ఘనంగా ముగిసింది. ముగిపు కార్యక్రమంలో భాగంగా రోబోటిక్ ఇంజనీర్ పి. వెంకటేష్ విద్యార్ధులకు నిరుపయోగమైన ప్లాస్టిక్ వస్తువులతో క్లీనింగ్ రోబో, పవన శక్తి స్టెతస్కోప్ వంటి సైన్స్ పరికరాలను ఏవిధంగా తయారుచేయాలో చెప్పి విద్యార్ధుల చేత తయారు చేయించారు. అనంతరం బి. స్వర్ణకుమార్ నైతిక విలువలు, సమాజ సేవ, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో కూడిన కొన్ని లఘు చిత్రాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జన విజ్ఞాన వేదిక కాకినాడ కార్యదర్శి, పి.ఆర్ కళాశాల అధ్యాపకుడు యుయస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం నిర్వహించాలని అన్నారు. విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలని దీనికోసం విద్యార్ధులే సంఘటితం అవ్వాలని సైన్స్ ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ఆట పాట విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జెవివి పెద్దాపురం కార్యదర్శి బుద్దా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వంగలపూడి శివకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







