జిల్లాలో ఏడు పాఠశాలల్లో ‘ఆనంద లహరి’

UPDATED 8th AUGUST 2017 TUESDAY  7:00 PM

కాకినాడ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యార్థులకు ఒత్తిడిలేని ఆట పాటలతో కూడిన విద్యను అందించేందుకు చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధ విద్యా సంస్థ రిషివ్యాలీ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసోర్సెస్‌(రివర్‌) భాగస్వామ్యంతో జిల్లాలోని 7 పాఠశాలల్లో ఆనందలహరి డెమో స్కూల్ ను ప్రారంభించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ రూరల్ పండూరు ఎంపీపీ పాఠశాలలో ఆనందలహరి డెమో స్కూల్ ను మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనందలహరి విద్యావిధానంలో మార్కులు, ర్యాంకుల గొడవ ఉండదని, పిల్లలకు ఏవిధమైన ఒత్తిడి లేకుండా పుస్తకాలులేని ఆనందలహరి అభ్యాసనను రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలో 300 పాఠశాలల్లో ప్రారంభించిందన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాటినే బట్టీ పట్టడం వల్ల మార్కులు వస్తున్నప్పటికీ విద్యార్దుల్లో విజ్ఞానం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయన్నారు. దీనివల్ల పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందన్నారు. 1930వ సంవత్సరంలోనే జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రిషివ్యాలీ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసోర్సెస్‌కు శ్రీకారం చుట్టారని, ఈ విద్యావిధానానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మనదేశంతో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, జర్మనీ, ఇథియోఫియా, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు సైతం ఈ విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాయని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారన్నారు. ఆనందలహరి అభ్యాసన పేరుతో మన రాష్ట్రానికి సరిపడే కొద్దిపాటి మార్పులతో ఈ విద్యావిధానాన్ని ప్రారంభించామన్నారు.13 జిల్లాలో 1342 పాఠశాలల్లో త్వరలోనే ఎంపిక చేసిన మండలానికి 2 పాఠశాలల్లో ఈ విద్యావిధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 66 పాఠశాలల్లోని 132 మంది విద్యార్థులకు రిషివ్యాలీలో శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆనందలహరి అభ్యాసన విధానంలో విద్యార్థులు ఫ్లకార్డులు, బొమ్మలు, ట్యాబ్‌ల సాయంతో విద్యను కొనసాగిస్తారని, చిన్నారులకు పుస్తకాలు, హోంవర్క్‌తో పనిలేదని అన్నారు. సందర్భానికి అనుగుణంగా బోధనా సామగ్రి అందించడంతో పాటు ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నారు. సర్వశిక్షాభియాన్‌ పీవో శేషగిరి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 1, 2 తరగతుల్లో బోధన జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3, 4, 5 తరగతులకు విస్తరించనున్నట్టు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో విద్యార్థులను ఆకర్షించే విధంగా బొమ్మలు, ఇతర ఉపకరణాలతో అందంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, సర్పంచ్ కొల్లాబత్తుల వీరబాబు, డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జయప్రకాష్‌, ఎంఈవో గణేష్‌బాబు, విద్యార్థులు,తదితరులు  పాల్గొన్నారు.
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us