* రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు
UPDATED 1st AUGUST 2020 SATURDAY 7:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): కౌలు రైతులకు పంట రుణాలు మంజూరుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక రమణయ్య పేటలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో 1,20,957 హెక్టార్ల విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని, అలాగే 68,578 మందికి పంట సాగు హక్కు పత్రాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో సాగుదార్ల స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేసి, వీటి ద్వారా నాబార్డ్ సహకారం కూడా తీసుకొని, బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ రైతు భరోసా కేంద్రం వద్ద కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, రైతులకు కావలసిన యంత్ర పరికరాలను స్థానిక రైతులకు తక్కువ అద్దెకు సరఫరా చేయడం జరుగుతుందని, దీని కోసం ప్రతీ రైతు భరోసా కేంద్రానికి రూ.15 లక్షల విలువ చేసే యంత్ర పరికరాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 1129 రైతు భరోసా కేంద్రాలలోని 865 కియోస్క్ లు ద్వారా రైతులు తమకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్డరు చేసి తమ గ్రామంలోనే పొందవచ్చని అన్నారు. జిల్లాలో ఇంతవరకు 7490 ఆర్డర్ల ప్రకారం రూ. 2,28,37,395 విలువైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పధకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా జాయింట్ డైరెక్టర్ కె.యస్.వి. ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్లు వి.టి. రామారావు, యస్. మాధవరావు, కాకినాడ ఏడిఏ జి.వి. పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. .







