UPDATED 27th JULY 2017 THURSDAY 9:00 PM
కాకినాడ : జిల్లాలో ఆగస్టు 1 నుంచి భూముల నూతన మార్కెట్ విలువలు అమలుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని గుడా వైస్ ఛైర్మన్, జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో జేసీ సమీక్షించారు. గ్రామాల్లో రెండేళ్లకు, పట్టణాల్లో ఏడాదికి భూముల మార్కెట్ విలువలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, దీనిని అమలు చేయాలని ఆదేశించారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో ఆగస్టు 1 నుంచి 5 శాతం మాత్రమే భూముల విలువ పెంచాలని, మిగిలిన మున్సిపాల్టీలు, గ్రామాల్లో ధరలు నిర్ణయించి, కమిటీ ఆమోదం తరువాత నూతన భూముల విలువ అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్, గుడా వైస్ ఛైర్మన్ విజయరామరాజు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ లక్ష్నీనారాయణరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్లు షఫీవుద్దీన్(కాకినాడ), మొహమ్మద్ సిరాజుల్లా(రాజమహేంద్రవరం), జడ్పీ సీఈవో పద్మ తదితరులు పాల్గొన్నారు.







