UPDATED 27th JUNE 2017 TUESDAY 7:30 PM
సామర్లకోట: ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు స్వచ్చంధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో విద్యార్థులకు నవభారత్ వెంచర్స్ సహకారంతో అందించిన స్కూల్ బ్యాగ్స్, ఫర్నిచర్ మొదలైన వాటిని ఆయన చేతుల మీదుగా మంగళవారం అందచేశారు. అలాగే బచ్చు మున్సిపల్ హైస్కూల్లో పలువురికి సైకిళ్ళను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు సహకారం అందించేందుకు స్వచ్చంధ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్నారు. ప్రభుత్వ చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాలతో పాటు దాతలు కూడా పేద ప్రజలకు సహకారం అందించాలన్నారు. బచ్చు ఫౌండేషన్ ఉన్నత పాఠశాలకు రూ. 4.50 లక్షలు వ్యయంతో టాయిలెట్లు కట్టించి ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, సైకిళ్ళను అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన పరిశీలించారు. త్వరలోనే శ్మశానవాటిక నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొడతా మార్తా, జెడ్పిటిసి గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, నవభారత్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. ప్రభాకరరావు, హెచ్ ఆర్ డి మేనేజర్ ఎం.రాఘవయ్య , ఎంఈవో రమణమ్మ, ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయి రామకృష్ణ, కౌన్సిలర్ భ్రమరాంబ, మన్యం చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.







