UPDATED 12th JULY 2018 THURSDAY 6:00 PM
పెద్దాపురం: ఓటర్ల జాబితా సవరణ, పోలింగు కేంద్రాలు ఏర్పాటులో రాజకీయ పార్టీలు సహకరించాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎస్.ఎస్.వి.బి. వసంతరాయుడు కోరారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగు కేంద్రాల ఏర్పాటుపై స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రతినిధులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ వరకు ఓటర్ల జాబితా పరిశీలించడం జరుగుతుందని, ఆగస్టు 31వ తేదీ వరకు మార్పులు, చేర్పులు పరిశీలించి, సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి జాబితాను విడుదల చేయడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు దానిలో ఏమైన మార్పులు, చేర్పులు ఉంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం 1,81,563 మంది ఓటర్లు, 204 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, దీనికి అదనంగా నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పెద్దాపురం మండలంలో తిరుపతి, దివిలి, ఆనూరు, సామర్లకోట మండలంలో పెదబ్రహ్మదేవం గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 1200, పట్టణ ప్రాంతంలో 1400 మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో మరొక కొత్త కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నీలపాల సూరిబాబు (సిపిఎం), పెనుమాక ఇజ్రా (బి.ఎస్.పి), నాగేశ్వరరావు (కాంగ్రెస్), పి. శ్రీనివాస్ (టిడిపి), చింతా శ్యామ్ (బిజెపి), బి. సూరిబాబు (సిపిఐఎం), పెద్దాపురం, సామర్లకోట తహసీల్దార్లు గంగుమళ్ళ బాలసుబ్రహ్మణ్యం, ఎల్. శివకుమార్, మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్. శేషాద్రి, సి.హెచ్. వెంకటేశ్వరరావు, సామర్లకోట టిపిఎస్ మంజుల, టిపివో రత్నకుమార్, ఎలక్షన్ డిటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







