UPDATED 23rd MAY 2017 TUESDAY 4:00 PM
కాకినాడ: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) పరిధిలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. స్థానిక తిమ్మాపురం క్యాంపు కార్యాలయంలో గుడా వైస్ చైర్మన్ వి.విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ ఏ.మల్లికార్జున, జెసి-2 రాధాకృష్ణమూర్తితో ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం దృష్టిలో పెట్టుకుని నూతనంగా గుడాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీనికి అనుగుణంగా జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంస్థల పరిధిలోని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాజానగరం-సామర్లకోట ఎడిబి రోడ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు విధి విధానాలను ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. జిల్లాలో గృహనిర్మాణ ప్రగతిని మంత్రి యనమల సమీక్షిస్తూ ఎన్టీఆర్ హౌసింగ్ కింద కేటాయించిన 24198 గృహాలు, ఎన్టీఆర్ గ్రామీణ్ కింద కేటాయించిన 14189 గృహాల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలన్నారు. ఈ గృహనిర్మాణాలపై జిల్లాలోని సంబంధిత శాసన సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అందరికి ఇల్లు పథకం కింద గృహ నిర్మాణాల కోసం మార్గదర్శక సూత్రాలు త్వరలో ఖరారు చేస్తారని ఈలోగా లబ్ధిదారుల వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలో సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టే పనులపై మంత్రి మాట్లాడుతూ ఈ నిధులు ఆయా సంస్థలు ఖర్చు చేయడం కాకుండా సెంట్రల్ పూల్ ద్వారా ఖర్చు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ నిబంధనల మేర రెండు శాతం నిధులు సిఎస్ఆర్ పనులకు వినియోగించాలని ఈ నిధుల వినియోగం పై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలన్నారు.







