UPDATED 8th MAY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక స్టేషన్ సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ధగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పెట్రోల్, డీజిల్ పై అక్రమ పన్నుల విధానాన్ని అమలు చేయడం వల్ల ముప్పై రూపాయలు గల పెట్రోల్ ఎనభై రూపాయలు పైబడి అమ్ముతున్నారని, ఈ విధానం వల్ల రూ. రెండు లక్షల అరవై వేల కోట్లు పైబడి సేకరించి కార్పోరేట్ సంస్థలకు రూ. ఐదు లక్షల కోట్లకు పైబడి రాయితీలు ఇచ్చారన్నారు. కాకులను కొట్టి రాబందులకు పోషించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారయ్యాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పెట్రోల్, డీజిల్‌పై అధికపన్నులు విధించి సామాన్యులపై భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సగటు వ్యక్తి వాహానాన్ని కొనుగోలు చేసినా అందులో పెట్రోల్ పోయించుకుని తిరగలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం గోవింద రాజు, తుంపాల శ్రీనివాస్, కె. శ్రీను, కె. తులసీదాసు, డి..శ్రీను, బి. బాలాజీ, ఎస్. యువరాజు, మహేష్, నాగు, తదితరులు పాల్గొన్నారు.







