మానవ వనరుల సద్వినియోగం కోసం నూతన యువజన విధానం

* 1400 కోట్లతో విశాఖపట్నం-కాకినాడ బీచ్ రోడ్
* ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం సంక్షేమానిదే
* నవ నిర్మాణ దీక్షలో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు
UPDATED 6th JUNE 2018 WEDNESDAY 10:00 PM
తొండంగి: రాష్ట్రంలో మానవ వనరులు సద్వినియోగం చేయడం, నిరుద్యోగ యువతుకు చేయూత అందించడానికి నూతన యవజన విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం తొండంగి మండల ఎంపిడివో కార్యాలయం వద్ద జ్ఞానభూమి, ఉపాధి కల్పన అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ. 1000/- చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పథకం ద్వారా నిరుద్యోగ భృతి పొందే యువత స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవలసిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని యువతీ, యువకుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల నుండి వచ్చిన వివిధ విజ్ఞప్తులను అనుసరించి నూతన పథకాలు రూపొందిస్తున్నామని, వీటిలో భాగంగా చంద్రన్నభీమా, పెళ్లి కానుక వంటి పధకాలు రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగుల జీతభత్యాలు, ఎస్టాబ్లిష్ మెంట్ చార్జీలు పోగా మిగిలిన ఆదాయామంతా సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 70 వేల కోట్లు సంక్షేమానికి వినియోగిస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశంలో ప్రథమస్థానంలో ఉందన్నారు. పింఛన్ల పంపిణీ కోసం 50 లక్షల మందికి ప్రతీ నెలా పింఛన్లు పంపిణీ కోసం రూ. ఏడు నుంచో ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, రాష్ట్రంలో మరో 3.5 లక్షల పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ పింఛన్లను అర్హులైన వారందరికీ త్వరలో అందజేస్తామన్నారు.  అనాధలైన ఒంటరి మహిళలకు కూడా పింఛన్ ఇచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమానికి అధిక  ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అవసరమైతే అప్పు చేసి కూడా పధకాలు అమలు పరుస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.  లక్షా 81 వేల కోట్లు అప్పులు ఉన్నాయని, ఈ సంవత్సరం పధకాల అమలుకు మరో 23 వేల కోట్లు అప్పులు తీసుకున్నామన్నారు. తొండంగి మండలంలోని కోనప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని , ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏర్పాటు చేసే పరిశ్రమల ద్వారా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. విశాఖపట్నం-కాకినాడ నాలుగు లేన్ల బీచ్ రోడ్డు నిర్మాణానికి ఎడిబి నిధులు రూ. 1400 కోట్లు మంజూరయ్యాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ రోజు ఒక అంశం పై చర్చలు నిర్వహించి దానిపై అభిప్రాయాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కోస్తా తీర ప్రాంతంలోని మత్స్యకారులు, షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన  తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో చంద్రన్న పెళ్ళి కానుక ద్వారా లబ్ది పొందిన జంటలను మంత్రి యనమల, కలక్టర్ కార్తికేయమిశ్రా ఆశీర్వదించారు. మండలంలోని స్వయంశక్తి సంఘాలకు 3.20 కోట్ల బ్యాంకు లింకేజి, 42 లక్షల స్త్రీ నిధుల చెక్కుల రూపంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి, డీఈవో ఎస్. అబ్రహం, యంపిపి చిట్టుమూరి సంధ్య రాజశేఖర్, జడ్పీటీసీ సభ్యురాలు చక్కా పెద్ద సత్యవతి, మండల అభివృద్ధి అధికారి బిహెచ్ఎస్ఎస్ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us