అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ‘ఓటీఎస్ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు’ అంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి రూ.5వేల కోట్లు దోచుకునేందుకు అధికార పార్టీ మాస్టర్ ప్లాన్ వేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా కదం తొక్కింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆ పార్టీ శ్రేణులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పేదలను ఓటీఎస్ పేరిట వేధించడం సరికాదని ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి, పార్టీ నేత దామచర్ల జనార్థన్ మండిపడ్డారు.







