Thirumala Brahmmotsavalu : భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

UPDATED 4th OCTOBER 2022 TUESDAY 08:00 PM

▪️ వేడుకగా రథోత్సవం

▪️ భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

Thirumala Brahmmotsavalu : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.

గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.

రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, రాష్ట్ర మంత్రివర్యులు వేణుగోపాల కృష్ణ, టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో ఏవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు పోకల అశోక్ కుమార్, రామేశ్వరరావు, మధుసూదన్ యాదవ్, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ‌కిషోర్‌, ఆలయ డెప్యూటి ఈవో ర‌మేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us