UPDATED 7th NOVEMBER 2017 TUESDAY 9:00 PM
కాకినాడ : కాకినాడ బీచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మంగళవారం తెలిపారు. బీచ్‌లో రూ.45 కోట్ల నిధులతో చేస్తున్న వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ హిమాంశు శుక్లాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ బీచ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పూర్తయితే మరింత మంది పర్యాటకులను ఆకట్టుకుంటుందన్నారు. సాగర సంబరాలను డిసెంబరు 19, 20, 21వ తేదీల్లో నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు రానున్నారని, ఇందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అనంతరం సాగర సంబరాల నిర్వాహక సంస్థ విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆర్డీ జి.భీమశంకరం, ఈఈ శ్రీనివాస్, ఆర్డీవో ఎల్.రఘుబాబు, సమాచార శాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్, తహసీల్దార్ జె.సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.







