UPDATED 17th MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని అందించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద గల అన్నపూర్ణ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ జెండా ఆవిష్కరించగా, జడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా దేవీపట్నం వద్ద లాంచీ ప్రమాదంలో మృతిచెందిన వారికి, అలాగే సామర్లకోట ఎంపిపి గొడతా మార్త, పెద్దాపురం వైస్ ఎంపిపి గోపు సతీష్ రాజా మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే సదుద్దేశంతో ఏ ప్రభుత్వం చేపట్టని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం, రాష్ట్ర అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పొత్తుపెట్టుకుని ఇంతకాలం సఖ్యతతో కొనసాగామని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులను ఇస్తామని ఇంతకాలం నమ్మబలికి, ప్రస్తుతం తెలుగు ప్రజలను తీవ్రంగా మోసగించిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్ర ప్రజలంతా ఏకతాటిపై నిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సంఘీభావాన్ని తెలపాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం, నియోజకవర్గ అభివృద్ధే అజెండాగా నిర్విరామంగా పనిచేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గడిచిన నాలుగేళ్లలో సిసి రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందని, నియోజకవర్గంలో ఏ విధమైన గ్రూఫు రాజకీయాలు లేవని, అందరూ ఒకేతాటిపై పయనిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), సామర్లకోట, పెద్దాపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు అడబాల కుమారస్వామి, బొడ్డు బంగారుబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, భీమేశ్వర ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మండల పార్టీ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్, కమ్మిలి సుబ్బారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







