UPDATED 21st JUNE 2017 WEDNESDAY 4:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి యోగాకు మంచి ఆదరణ ఉందని, యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యోగాపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రచారం నిర్వహిస్తున్నట్లు అన్నారు. అనంతరం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యోగాభ్యాసంతో రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం తమ స్కూల్ లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ యోగా గురువు కె. సుధ విద్యార్థులతో యోగాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎన్. సురేష్, పాఠశాల డీన్ బి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.







