UPDATED 2nd AUGUST 2017 WEDNESDAY 6:00 PM
కిర్లంపూడి : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన అమరావతి పాదయాత్రపై పోలీసుల ఆంక్షల గడువు బుధవారంతో ముగియడంతో మళ్లీ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు కిర్లంపూడిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం పాదయాత్రను ప్రారంభించేందుకు ముద్రగడ సిద్ధమవుతుండడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలు బుధవారం సాయంత్రానికి కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా మరోవైపు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ ఈనెల ఆరో తేదీన కిర్లంపూడికి విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం తన నివాసానికి వచ్చిన కాపు సంఘాల నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.







