-- సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
UPDATED 4th AUGUST 2017 FRIDAY 3:00 PM
పెద్దాపురం : పట్టిసీమ తరహాలోనే పురుషోత్తమపట్నం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా పెద్దాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. గత మూడు నెలలుగా అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ జులుంతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్ చేతిలో కీలుబొమ్మగా మారాడని, రైతుల పక్షాన నిలబడి వారికి బాసటగా నిలవాలని హితవు పలికారు. ఆలాగే ఇటీవల ఎలక్షన్ కమిషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిందని దీనిని సిపిఐ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఐతే ఎన్నికలను వాయిదాలేకుండా నిర్వహించాలని ఆయన సూచించారు. స్మార్ట్ సిటీగా ప్రకటించిన కాకినాడ నగరంలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయని, కొద్దిపాటి వర్షానికే నగరం ముంపు బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. సుమారు ఏడు సంవత్సరాలుగా ఎన్నికలు జరపని కారణంగానే ఇటువంటి దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. కర్నూలు, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన సూచించారు. జిల్లాలో సెక్షన్ 30,144 సెక్షన్లు అమలు చేస్తూ సామాన్య ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురిచెయ్యడం సరికాదని, అలాగే సమస్యలపై ప్రజాసంఘాలు ఎటువంటి మీటింగ్ లు, ధర్నాలు చేపట్టకూడదని చెప్పడం సిగ్గు చేటని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని విమర్శించారు. కుభేరులకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలకు రాయితీలను ఉపసంహరించుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ రాయితీలను తగ్గించడం చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాన్ని అవలభిస్తున్నాయని దీన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని సిపిఐ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కిషోర్, అంబటి కృష్ణ, ఎలిశెట్టి రామదాసు తదితరులు పాల్గొన్నారు.







