UPDATED 12th AUGUST 2017 SATURDAY 11:00 AM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన లక్ష్మీ గణపతి ఆలయంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం ప్రత్యేక పూజలు చేశారు. సుమారు రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన ఆలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి) ఆధ్వర్యంలో హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పెనికేరు గ్రామానికి చెందిన ప్రముఖ వేద పండితులు కాళ్ళకూరి దుర్గా ప్రసాద్ శర్మ, విలపర్తి వీరభద్ర శర్మ పర్యవేక్షణలో అర్చకులు కొత్తలంక శ్రీనివాస శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. దీనిలో భాగంగా యంత్ర స్థాపన, కళాన్యాసం, జీవాధార, గోదృష్టి, మహా పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం హోం మంత్రికి వేదాశీర్వచనాలు, ప్రథమ దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు. ఆలయాల పునః ప్రతిష్ఠను పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 10 వేల మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.







