ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని సొంతం చేసుకున్న పంజాబ్ యువతి హర్నాజ్ సంధుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్- 2021 పోటీల్లో హర్నాజ్ సంధు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించి అందాల కిరీటాన్ని గెలుచుకోవడంపై ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు చెబుతూ మోదీ ట్వీట్ చేశారు. తన అందంతో పాటు జడ్జిలు అడిగిన కఠినమైన ప్రశ్నలకు తెలివైన సమాధానాలు చెప్పడం ద్వారా వారిని మెప్పించిన 21ఏళ్ల హర్నాజ్ సంధు విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఇప్పటివరకు భారత్ నుంచి ఈ అరుదైన స్థానం దక్కించుకున్న సుస్మితా సేన్ (1994), లారా దత్తా (2000) సరసన చేరింది. గతంలోనూ అందాల పోటీల్లో పాల్గొని టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. హర్నాజ్ పంజాబ్ చిత్రాల్లోనూ నటించింది.







