Updated 25th december 2022 Sunday 6:00 am
BRS In AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ ఉంటుందని, జనవరి చివరలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని వెల్లడించాయి. అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. తాత్కాలిక కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 26 లేదా 27న ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది.
94910 15222.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వారి కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి నాయకులు, అన్ని సంఘాల నేతలు, బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు వచ్చి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. అదే రోజు ప్రగతి భవన్ లో లంచ్ మీటింగ్ కూడా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసిన వారి పేర్లు, వివరాలు నమోదు చేసుకుంటారు. వారందరికి పార్టీ సభ్యత్వం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వం ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడా సభ్యత్వం ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.







