UPDATED 10th APRIL 2022 SUNDAY 01:00 PM
CM Jagan New cabinet : ఏపీ మంత్రుల తుది జాబితా ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను పంపించనున్నారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు లోపు.. మంత్రుల జాబితాను గవర్నర్ ఆమోదించనున్నారు. అంతకంటే ముందు.. మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. ఇక మంత్రి పదవులు పొందిన వారిలో బోత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, విడుదల రజిని, జోగి రమేష్, ధర్మన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, వేణుగోపాల్, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డిల పేర్లు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. కోర్ టీమ్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు. చివరి నిమిషంలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇక తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పలువురు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. లిస్టులో తమ పేరు ఉందా ? లేదా ? అనే టెన్షన్ లో వైసీపీ నేతలున్నారు. కొంతమంది గుళ్ల చుట్టూ మరికొంతమంది ఆశావాహులు తిరుగుతున్నారు.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కేబినట్ ను పునర్ వ్యవస్థీకరించారు. ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, వారి అనుభవం ఆధారంగా కొంతమందిని కొనసాగించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులున్నారు. ఇటీవలే పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 24 మంది మంత్రులు స్వచ్చందంగా రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ.. గవర్నర్ కు లేఖ పంపారు. వీటిని రాజ్ భవన్ ఆమోదించాక రాజ్ భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. ఇప్పటి దాక ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మందికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
మంత్రులుగా పేర్లు ఖరారు అయిన వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారం ఇస్తారని.. సోమవారం నాడు అందుబాటులో ఉండాలని చెబుతారని తెలుస్తోంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో పక్కన ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు.







