తొలి ఏకాదశి

UPDATED 23rd JULY 2018 MONDAY 7:00 AM

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని అతి పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాదులను విసర్జిస్తారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతోపాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us