నైతిక విలువలు పెంచే వేదిక 'శుభప్రదం'

UPDATED 26th MAY 2017 FRIDAY 11:00 PM

తిరుపతి: భారతీయ సనాతన ధర్మంలో నవతరానికి  నైతిక విలువలు, బాధ్యత, విధి, ధర్మాలపై అవగాహన కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ప్రతి ఏడాది వేసవిలో "శుభప్రదం" శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్   సింఘాల్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు, ధర్మప్రచార మండళ్ల సభ్యులకు తిరుపతిలోని శ్రీ  వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్‌ బ్లాక్‌ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మూడు రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  టిటిడి ఈవో హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యుగాలు మారినా, జగాలు మారినా శాశ్వతంగా నిలిచేది సనాతనధర్మమేనని అన్నారు. పండుగలు, ఉత్సవాలు, నోములు, వ్రతాలు, సమైక్యతను పెంచేవి కాబట్టి పెద్దలు చూపిన మార్గంలోనే పయనించినప్పుడే ధర్మాన్ని రక్షించినవాళ్లమవుతామనే అంశాన్ని పిల్లలకు బోధించాలన్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లల్లో పోటీతత్వం పెరిగిందని, మార్కులు ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి, అతి తక్కువ కాలంలో అవసరానికి మించి డబ్బు, హోదా ఎలా సంపాదించాలనే అంశాలపైనే దృష్టి పెడుతున్నారని అన్నారు. అవి ఒక్కటే శాశ్వతం కాదని నీతిగా, నిజాయితీగా ఉంటూ ఉన్నంతలో ఎలా సంతోషంగా  ఉండాలనే అంశాలను క్షేత్రస్థాయిలో బోధించాలన్నారు. పిల్లలకు పాఠ్యాంశాల బోధన ద్వారానే కాకుండా టెక్నాలజీని అనుసంధానం చేస్తే మరింత సులువుగా, ఉత్సాహవంతగా అర్థం చేసుకుంటారన్నారు. రాబోయే రోజుల్లో  కేవలం చదవడం, వినడం ద్వారానే కాకుండా ఛోటా భీం ప్రోగ్రాం తరహాలో చూసేందుకు వీలుగా శుభప్రదం పాఠ్యాంశాలను తీర్చిదిద్దాలన్నారు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారని, అదే తరహాలో  ఆయా జిల్లా కేంద్రాలలో శిక్షణ ఇచ్చి పిల్లలలో సమాజం పట్ల వారికున్న బాధ్యతలను తెలియజేయాలన్నారు. ప్రతి ఏడాదీ మరింత మెరుగ్గా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠ్యాంశాలను మెరుగుపరుస్తామన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  పోల భాస్కర్‌ మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించడం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారానే సాధ్యమన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ తరగతుల్లో శ్రీవేంకటేశ్వరుని జీవితచరిత్ర, భగవద్గీత, సనాతన ధర్మపరిచయం, రామాయణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వాఙ్మయం, వ్యక్తిత్వ వికాసం, భారతీయ కుటుంబ జీవనం, పండుగలు- పరమార్థాలు, ఆచారాలు - వైజ్ఞానిక దృక్పథం, మాతృభాష, విద్య, దేశభక్తి తదితర అంశాలపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి రామకృష్ణా రెడ్డి , ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య జి. దామోదర నాయుడు, ఆచార్య గల్లా చలపతి, విశ్రాంత ఆచార్యులు  కె. సర్వోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us