UPDATED 8TH MAY 2017 MONDAY 11:00 PM
అన్నవరం : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం సాయంత్రం సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల సమక్షంలో వేదపండిత సదస్యం ఘనంగా జరిగింది. అనివేటి మండపంలో క్షేత్రపాలకులు, పెండ్లిపెద్దలైన సీతారాములవారి సమక్షంలో అత్యంత సుందరంగా పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లను ఆశీనులను చేసి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సరస్వతీపూజ, మహాదాశీర్వచనము, పండిత సదస్యము, పండిత సత్కారము(వేదశాస్త్ర సభ) తదితర కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రత్నగిరి పరిసరాలు మార్మోగాయి. అనంతరం వేదపండితులను దేవస్థానం చైర్మన్ ఐ వి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకర్ల నాగేశ్వరరావు పాల్గొని పండితులను సత్కరించి దేవస్థానం తరపున పారితోషికం, ప్రసాదం అందచేసి ఘనంగా సత్కరించారు. రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్లను పొన్న వాహనంపై ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.







