పశువుల మృతి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు

UPDATED 20th JULY 2017 FRIDAY 8:00 PM

కాకినాడ: జంతు హింస నివారణ సంఘం(ఎస్‌పీసీఏ)లో పశువుల మృతి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో భేటీ అయ్యారు. ఎస్‌పీసీఏలో పారిశుద్ధ్యం, పశువుల సంరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ పశువుల మృతికి కారణమైన వారిపై కేసులు నమోదుచేస్తున్నామని, ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి ఆర్డీవో ఛైర్మన్‌గా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎస్‌పీసీఏ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేస్తున్నామని, ఇక్కడ బయోగ్యాస్‌ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసిందని, దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ఈ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించడానికి డిజైన్లు సిద్ధం చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం గోదావరి పరివాహక ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సీజనల్‌ వ్యాధుల ప్రభావం లేకుండా పారిశుద్ధ్యాన్ని పూర్తిస్థాయిలో చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇఎస్‌ఐ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, దీనిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. కాపు, బీసీ కార్పొరేషన్ల కార్యాలయాలకు మినీ కన్వెన్షన్‌ హాలు మాదిరి నిర్మాణాలు చేయటానికి స్థలాలు గుర్తించాలని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us