UPDATED 3rd AUGUST 2018 FRIDAY 6:00 PM
రంపచోడవరం: రానున్న స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఏజెన్సీ పరిధిలోని 319 అంగన్వాడీ కేంద్రాలకు కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టి ఉద్యమరూపంలో పూర్తి చేయనున్నట్లు సబ్ కలక్టర్, ఇంచార్జ్ పివో డాక్టర్ వి. వినోదకుమార్ అన్నారు. మండల పరిధిలోని బి. వెలమలకోట పంచాయితీ పరిధిలోని మునిచిడుగుల ఆవాసంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి పనితీరుపై ఆరాతీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నాటికి కమ్యూనిటీ మరుగుదొడ్లు అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా ఉద్యమరూపంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఏజెన్సీ పరిధిలో గల 319 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్కటి రూ. 30 వేలు చొప్పున నిధుల కేటాయించి రూ. 95 లక్షల 70 వేలతో నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కమ్యూనిటీ మరుగుదొడ్లలో ఒకటి చిన్నారులకు, మరొకటి గర్భిణీలు, బాలింతలకు, నీటితోట్టితో రన్నింగు వాటర్ సౌకర్యాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. మునిచెడుగుల అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి, త్రాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్ సౌకర్యాలు లేనట్లు ఆయన గుర్తించి, త్వరలో వసతులు కల్పనకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ కొరకు అంగన్వాడీ సిబ్బంది మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని, ఏజెన్సీ పరిధిలోని 524 అంగన్వాడీ కేంద్రాలకుగాను ఇంకా 361 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు లేవని వీటన్నింటికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలన్నారు. పైపులైను ద్వారా త్రాగునీటి వసతులు లేని కేంద్రాలకు స్థానికంగా బోర్ వెల్ త్రవ్వించి త్రాగునీటి వసతులు కల్పిస్తామని, సుమారు 158 కేంద్రాలకు బొర్ వెల్ సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా చేస్తున్న సేవలను ప్రభుత్వం విస్తరిస్తోందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పౌష్టికాహారం అందించేందుకు, శిశుమరణాలు తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఇటీవల అమృత హస్తానికి అదనంగా బాల సంజీవని కార్యక్రమాన్ని అమలులోనికి తెచ్చిందని ఈ పథకం గర్బిణీలు, బాలింతలకు వరమన్నారు. అనుబంధ పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్యతనిఖీలు, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య, బాల, స్త్రీ సదనాలు, తదితర సేవలను ఐసిడిఎస్ నిర్వహిస్తోందన్నారు. గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారుల పోషణ స్థితి మెరుగుదలకు అదనపు పౌష్టికాహారం ఆందించడమే బాల సంజీవని లక్ష్యమన్నారు. తొలుత సిడిపివోలు, ఇవోపిఆర్డీలు, ఎంపిడివోలు ట్రాన్సుకో అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించి ఉపాధి హామీ పథకం ద్వారా వేతనకూలీలకు 100 రోజుల పనిదినాలు కల్పన, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాలకు వసతులు కల్పన, సోక్ పిట్స్, సేద్యపు నీటికుంటలు ఏర్పాట్లలో పురోగతి అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమాలలో ట్రాన్సుకో ఎడిఇ వై.వి లక్ష్మీనారాయణ, ఎఇ దొరబాబు, ఎపిడి జగదాంబ, సిడిపివో భాగ్యరేణుక, తదితరులు పాల్గొన్నారు.







