కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వం పటిష్ట చర్యలు

* రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

UPDATED 24th JULY 2020 FRIDAY 7:00 PM

అమలాపురం(రెడ్ బీ న్యూస్): దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, సమాజంలో పది శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని, దీని నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అమలాపురం డివిజన్ పరిధిలో గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు 22,521 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 1,495 పాజిటివ్, 21,026 నెగిటివ్ కేసులు వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ కేసుల్లో 956 మందిని ఐసోలేషన్ సెంటర్స్ కు తరలించగా 525 మందిని హోం ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని, మిగిలిన యాక్టివ్ కేసులు కిమ్స్, బొమ్మూరులో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. 1091 మందిని చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయడం జరిగిందని అన్నారు. అమలాపురం డివిజన్ పరిధిలో గత మార్చి నుంచి ఇప్పటివరకు 14 కోవిడ్ మరణాలు సంభవించాయని, అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులకు 24 వార్డులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అమలాపురంలో విద్యుత్ దహన వాటికను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనాతో మరణించిన వారి పట్ల ప్రజలెవరూ వివక్షత చూపరాదని మంత్రి హితవు పలికారు. కరోనాతో మరణించిన వారికి ఒక్కొక్కరికి దహన సంస్కారాలు నిమిత్తం రూ.15 వేలు వంతున రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా మంజూరు చేశారని అన్నారు. అనంతరం అమలాపురం డివిజన్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, డీఎస్పీ షేక్ మసూం భాషా, మున్సిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్. రాజు, అమలాపురం, అల్లవరం మండలాల తహసీల్దార్లు మాధవరావు, అప్పారావు, అల్లవరం ఎంపీడీవో సుగుణ శ్రీ కుమారి, ఏడిఎం&హెచ్ఓ డాక్టర్ పుష్కర రావు, పంచాయిత్ రాజ్ డిప్యూటీ ఈఈలు రాంబాబు, మురళీకృష్ణ, కే.ఆర్.సి. తహసీల్దార్ లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us