UPDATED 3rd AUGUST 2017 THURSDAY 7:00 PM
కిర్లంపూడి: ఛలో అమరావతి పేరుతో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను గురువారం పోలీసులు మళ్ళీ అడ్డుకోవడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జులై 26న కిర్లంపూడి నుంచి పాదయాత్రకు ఉపక్రమించిన ముద్రగడను పోలీసులు అడ్డుకోవడం, వారం పాటు విధించిన ఆంక్షలు బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం కిర్లంపూడిలోని తన నివాసం నుంచి అనుచరులతో కలిసి పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను గేటు వద్ద ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర నిర్వహణకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోని కారణంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అనుమతించడం లేదని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగిన ముద్రగడ ‘మీరు అనుమతించే వరకు ప్రతి రోజూ పాదయాత్రకు బయలుదేరుతానని’ పేర్కొని ఇంటికి వెనుదిరిగారు. ముద్రగడ పాదయాత్రను పోలీసులు తిరిగి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కిర్లంపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కిర్లంపూడి పోలీసుస్టేషన్‌లోనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ నయీమ్ అస్మీ ముద్రగడ నివాసం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. కిర్లంపూడికి వచ్చే దారుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఉదయం 11 గంటల వరకు స్థానిక గుర్తింపు పత్రాలు లేని వ్యక్తులను చెక్‌పోస్టుల వద్ద నిలిపివేశారు.







