అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: తన హత్యకు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. రాధాపై జరిగిన రెక్కీ విషయంలో సమగ్ర విచారణ జరిపి.. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.
బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా రాధాను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. నేరస్థులపై సమగ్ర విచారణ.. కఠినమైన చర్యలే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని చంద్రబాబు అన్నారు.







