Updated 9th April 2023 Sunday 1:30 pm
Corona Cases : కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైరస్ తగ్గుముఖం పడుతుందనుకున్న తరుణంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ Corona Cases (1)రోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఏలూరు జిల్లాలో 4, ప.గో.జిల్లాలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
శనివారం కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి30న భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకి ఏప్రిల్ 8న మృతి చెందినట్లు నిర్ధారించారు. అతని స్వగ్రామం కొండపల్లిలో కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్టులు చేసిన అధికారులు వారిని హోం క్వారంటైన్ కు పంపారు.
మరోవైపు ఢిల్లీ, కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఢిల్లీలో కొత్తగా 535 కరోనం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20 వేల 13 లక్షల 938కు చేరింది. వీటిలో 26 వేల 536 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 23.05 శాతానికి పెరిగింది. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు.







