UPDATED 25th FEBRUARY 2018 SUNDAY 6:00 PM
గండేపల్లి: 2019 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి, మల్లేపల్లిలో పోలవరం కాలువ, బ్రిడ్జ్ పనులను మంత్రి, జగ్గంపేట, ప్రత్తిపాడు శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019 నాటికి పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ నిమిత్తం రూ. మూడు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, ఈ మొత్తాన్ని మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వానికి పంపామని అన్నారు. మే నెలాఖరు నాటికి కాలువ పనులు, బ్రిడ్జ్ పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏలేరు ఎడమ కాలువ పనులకు 42 రోజుల్లో భూసేకరణ జరిపి రైతులను ఒప్పించే భాద్యత జగ్గంపేట శాసన సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీసుకోవాలని మంత్రి కోరారు. ఏలేరు కాలువలో నీటి సామర్థ్యం తక్కువగా ఉందని, భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బంది కలగవచ్చని ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు మంత్రి దృష్టికి తీసుకురాగా, సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం కాలువ పనులను పరిశీలించడానికి వస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో హోసింగ్ బోర్డు సభ్యుడు కందుల కొండయ్యదొర, ఎఎంసి చైర్మన్ ఎస్.వి.ఎస్. అప్పలరాజు, ఇరిగేషన్ ఎస్.ఈ. కృష్ణారావు, జెడ్పిటిసి సభ్యుడు ఎర్రంశెట్టి వెంకటలక్ష్మీబాబు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.







