అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యవసాయరంగంలో పెనుమార్పులు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేసే ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సాంకేతిక సహకార ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్‌బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తారు. ఈ ఒప్పందం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కర్షకులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, ఈ-క్రాపింగ్ తదితర అంశాలను ఎఫ్‌ఏఓ ప్రతినిధులకు వివరించారు. రైతుల ఆదాయం పెంచేందుకు, పౌష్టికాహారం అందించేందుకు ఒప్పందం దోహదపడుతుందని ఎఫ్‌ఏఓ కంట్రీ డైరెక్టర్ టోమియో షిచిరి తెలిపారు.







