UPDATED 25th JUNE 2022 SATURDAY 12:40 PM
Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేతే అంటూ చంద్రబాబు గుర్తు చేశారు. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ.. తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం జగన్ వివరించి నేటికి మూడేళ్లు అవుతుందని ఎద్దేవా చేశారు.
కూల్చివేతలే తప్ప జగన్ కు నిర్మాణం చేతకాదని చంద్రబాబు విమర్శించారు. ఏపీ అభివృద్ధిని కూల్చాడని, రాష్ట్ర ఆర్థిక స్థాయిని కూల్చాడని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చాడంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దళితుల గూడును, యువత భవితను, ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.







