హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan babu) కీలక ప్రకటన చేశారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆయన తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు, అభిమానులు, శ్రేయోభిలాషుల దీవెనలతో మోహన్ బాబు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సగర్వంగా చెబుతున్నానని ట్విటర్ వేదికగా తెలిపారు. "శ్రీ విద్యానికేతన్ లో వేసిన విత్తనాలు ఇప్పుడు పెరిగి కల్పవృక్షాలయ్యాయి. 30 ఏళ్ల మీ నమ్మకం, వినూత్నంగా విద్యనందించాలనే నా జీవిత ఆశయం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరింది. మీకోసం తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. మీ ప్రేమే నా బలం. మీ సహకారం కొనసాగుతుందని నేను బలంగా నమ్ముతున్నా' అని ట్విటర్లో మోహన్ బాబు తెలిపారు.