UPDATED 20th APRIL 2022 WEDNESDAY 06:00 AM
Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.రాష్ట్రంలోనే కాదు అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పలు సవాళ్ళను ఎదుర్కొన్న ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన తన 73వ అడుగుపెట్టనున్న సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
నిరాడంభరంగా పార్టీ కార్యాలయంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొనున్న చంద్రబాబు.. బుధవారం పుట్టినరోజు నాడు నేతలతో, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు. నేటి నుంచి ఎన్నికల వరకు ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచించుకున్న చంద్రబాబు.. ఈరోజు నుండే అది అమలు చేయనున్నారు.







