అతిరాత్ర వీక్షణం..తరించిన భక్తజనం

* రెండవ రోజుకు చేరుకున్న అతిరాత్ర మహాయాగ క్రతువు
* పశ్చిమదిశలో నిర్వహించిన యాగాలు
* దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక మంత్ర జపం
UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM
 
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జరుగుతున్న అతిరాత్ర ఉత్కృష్ణ శ్రౌత సోమయాగ క్రతువు రెండోరోజుకు చేరుకుంది. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో యాగాన్ని వీక్షించేందుకు తరలివస్తున్నారు. యాగకర్త కేశాప్రగడ హరిహరనాథ శర్మ నేతృత్వంలో ఈ అతిరాత్ర మహాయాగంలో రెండవరోజైన ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి వేదస్వస్తి, శాంతిపాఠం, ప్రవర్గ్య సంభారం, నాందీ శ్రాద్దం, సోమపరివేషణం, సోమపూజనం, కూష్మాండ హోమం, దీక్షణీయయాగం, యజమాన క్షురకర్మ, అప్పు దీక్ష, తీర్థస్నానం, దీక్షా హోమం, దీక్షా గ్రహణం, ఉఖాపాత్రే అగ్నిప్రజ్వలనం, విష్ణుక్రమణం, అసంద్యామ్, ఉఖ్యాగ్ని స్థాపనం, ముష్టికరణం, వ్రత గ్రహణం మొదలయిన కార్య క్రమాలను అత్యంత వైభవంగా ఋత్విక్కులు  నిర్వహించారు. యాగ యజమాని త్రేతాగ్నిహోత్రి కిరణ్ అవధాని, మాలినీ దంపతులు యాగశాలకు ఉత్తరదిశలో ఉన్న గోవు, మేక నుంచి పాలను సేకరించి వాటిని నేతితో కలిపి అగ్నికి అర్పించారు. ప్రవర్య సంబారంలో భాగంగా ఈ యాగం కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన యజ్ఞపాత్రలను పూజించారు. అలాగే అగ్నికి ప్రదక్షిణ చేశారు. అలాగే దేశం సుభీక్షంగా ఉండాలని ప్రార్థించారు. శాంతి సౌభ్రాతృత్యాలు విరాజిల్లాలని కాంక్షిస్తూ ప్రత్యేక మంత్ర జపం చేశారు. అనంతరం అగ్నిమథనం తరువాత ప్రజ్వరిల్లిన అగ్ని వెళ్లడానికి ఎన్నో మార్గాలున్నా రాజమార్గం గుండా వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. అలాగే అశ్వాన్ని యాగశాలలో ప్రదక్షిణింపచేశారు. అశ్వం నడయాడిన ప్రదేశంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చివరి కార్యక్రమంగా ఉదయం గోవు నుంచి సేకరించిన ఆవుపాలను యజమాని దంపతులు సేవించారు. యాగాన్ని తిలకించేందుకు కంచి మహాసంస్థానం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి విచ్చేశారు. అలాగే భక్తులు యాగాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద నిలుచుని తన్మయత్వంతో యాగాన్ని తిలకించారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us