UPDATED 25th MARCH 2018 SUNDAY 7:00 PM
పెద్దాపురం: సుపరిపాలనకు శ్రీరాముడు ఆద్యుడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానిక ఎస్.ఆర్.వి.బి.ఎస్.జె.బి. మహారాణి ధర్మసత్రంలో వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడు ఆదర్శనీయుడుని, సుపరిపాలనకు ఆయన ఆద్యుడని అన్నారు. తండ్రి మాట జవదాటని పితృవాక్య పరిపాలకునిగా రాములవారు ప్రసిద్ధులని, తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ సంప్రదాయ, సంస్కారాలను రామాయణం తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు( రాము), టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కాకినాడ రామారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్. పుష్పనాధం, తదితరులు పాల్గొన్నారు.







