UPDATED 23rd OCTOBER 2022 SUNDAY 05:00 PM
Srinivasamangapuram : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.
స్వామి, అమ్మవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. తిరుమంజనంలో స్వామి అమ్మవార్లను తులసి, వివిధ సాంప్రదాయ పుష్ప మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. కాగా, సాయంత్రం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం సమర్పణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, మారుతి ప్రసాద్ , జేఈవో వీరబ్రహ్మం , ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.







