UPDATED 3rd MARCH 2022 THURSDAY 06:00 AM
East Godavari: వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షంపైకి తప్పులు నెట్టేయడం బాగా అలవాటైపోయిందని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. సుధా కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. తమ అధినేత చంద్రబాబునుద్దేశించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. వివేకా హత్యకేసును చంద్రబాబుపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని, కేసును తప్పుదోవ పట్టించే విధంగా సునీతారెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
సజ్జల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. సీబీఐ విచారణలో ఎంపీ అవినా్‌షరెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు బయటకు వచ్చాయని, వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో కేసును పక్కదారి పట్టించేందుకు సజ్జల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కోడికత్తి కేసుకు సంబంధించి తమ అధినేత చంద్రబాబుపై నేరాన్ని నెట్టే ప్రయత్నం చేశారన్నారు.
అలాగే వివేకా కుమార్తె సునీతారెడ్డి తన తండ్రిని చంపింది ఎవరనేది సీబీఐకి వాంగ్మూలం ఇచ్చినా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని, సీబీఐ పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసులన్నింటినీ పక్కదారి పట్టించి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి జగన్ అన్ని విషయాల్లో తప్పులు చేసి ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వివేకా హత్యకేసును తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని, సీబీఐ ఇప్పటికే అవినాష్‌రెడ్డి కూడా అనుమానితుడే అని చెప్పిందని, తక్షణమే అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలని రాజప్ప డిమాండ్ చేశారు. సమావేశంలో గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు తదితరులు పాల్గొన్నారు.







