UPDATED 19th NOVEMBER 2022 FRIDAY 8:50 PM
Akasa Air: ఏపీ, విశాఖపట్నం ప్రజలకు గుడ్ న్యూస్. ఇటీవలే విమానయాన సేవలు ప్రారంభించిన దేశీయ సంస్థ ‘ఆకాశ ఎయిర్’ త్వరలో విశాఖ పట్నం నుంచి విమాన సర్వీసులు నడపనుంది. డిసెంబర్ 10 నుంచి విశాఖ పట్నం-బెంగళూరు మధ్య విమానయాన సేవలు మొదలవుతాయని ఆ కంపెనీ ప్రకటించింది.
దేశీయ విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ గత ఆగష్టులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ 9 రూట్లలో సర్వీసుల్ని నడుపుతోంది. ఇప్పుడు పదో మార్గంగా విశాఖ పట్నం-బెంగళూరును ఎంచుకుంది. ఈ రెండు నగరాల మధ్య ‘ఆకాశ ఎయిర్’ రోజుకు రెండు సర్వీసులు నడపబోతుంది. డిసెంబర్ 10న తొలి సర్వీసు ప్రారంభమవుతుంది. 12న రెండో సర్వీసు మొదలవుతుంది.
ఆ తర్వాత నుంచి రోజూ రెండు సర్వీసులు నడుస్తాయి. ఈ సర్వీస్ ప్రారంభంతో బెంగళూరు నగరం నుంచి 8 నగరాలకు, రోజుకు 24 నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభించినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ నెల 26 నుంచి పుణె-బెంగళూరు మధ్య రెండు సర్వీసుల్ని ప్రారంభించబోతుంది.







