ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలి

జడ్పీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌
UPDATED 3rd SEPTEMBER 2017 SUNDAY 9:00 PM
కాకినాడ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని  జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ అన్నారు. స్థానిక జడ్పీ మీటింగ్ హాల్లో జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం ఆదివారం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన జడ్పీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో జరిగే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని, ఆయా అభివృద్ధి పనుల వివరాలను స్థానిక ఎమ్మెల్యేలతోపాటు జడ్పీటీసీ సభ్యులకు తెలియచేయాలని అధికారులకు  సూచించారు. పనుల ప్రగతిని కూడా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు వివరించాలని, ప్రజా  సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించుకుంటే ఎటువంటి ఇబ్బందులుండవని, ప్రజలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని  ఆయన కోరారు. అనంతరం స్థాయీ సంఘాల సమావేశంలో శాఖల వారీగా సమీక్షించారు. మొదటిగా రెండో స్థాయీ సంఘ సమావేశంలో డీఆర్‌డీఏ, గృహనిర్మాణం, పౌరసరఫరాలు, సహకార శాఖలపై  సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అనుసంధానంతో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద జిల్లాకు 14,189 గృహాలు మంజూరయ్యాయని ఆ శాఖ ఈఈ సుధాకర్‌ పట్నాయక్‌ తెలిపారు. ఇందులో 529 పూర్తయ్యాయని, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద 23,893 గృహాలు మంజూరు కాగా 9,843 పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో వంట గ్యాస్‌ కనెక్షన్లను నూరుశాతం అందజేశామని, రేషన్‌ కార్డులను ఆధార్‌తో 99.92 శాతం అనుసంధానం చేశామని పౌరసరఫరా శాఖ జిల్లా అధికారి రవికిరణ్‌ తెలిపారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 2017-18 సంవత్సరానికి రూ.490.40 కోట్లతో 25,070 స్వయ ఉపాధి యూనిట్లను మంజూరు చేయనున్నామని, కాపు కార్పొరేషన్‌ ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో 116 గ్రూప్ యూనిట్లకు శిక్షణ ఇచ్చామని ఈడీ ఎం.జ్యోతి తెలిపారు. జిల్లాలో 8,06,896 ఉపాధి హామీ జాబ్‌ కార్డులను జారీ చేయటం జరిగిందని, ఇంతవరకు 3,52,889 కుటుంబాలకు పని కల్పించామని డ్వామా అడిషనల్ పీడీ ఎం.శ్యామల తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 12,500 సంఘాలకు స్త్రీ నిధి కింద రూ.100 కోట్ల రుణాలిచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్‌డీఏ పీడి మల్లిబాబు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలో 2,673 మంది లబ్ధిదారులకు రూ.39.54 కోట్ల విలువైన యూనిట్లను మంజూరు చేసినట్లు ఆ సంస్థ ఈవో డాక్టర్‌ ఎన్‌.కిషోర్‌ తెలిపారు. 10 మంది లబ్ధిదారులకు 1.57 కోట్ల విలువైన ఇన్నోవా కార్లను అందచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వైస్‌ ఛైర్మన్‌ పెండ్యాల నళినీకాంత్‌, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డిప్యూటీ సీఈవో సుబ్బారావు, డీఈవో ఎస్‌.అబ్రహం, ఎస్‌ఎస్‌ఏ పీవో ఎం.శేషగిరి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రయ్య, జడ్పీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us