ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు

UPDATED 8th AUGUST 2017 TUESDAY 6:00 PM

పెద్దాపురం: ప్రభుత్వ కార్యాలయాలకు నూతన సొంత భవనాలు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మించిన ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు వంద సంవత్సరాలు పైబడిన కారణంగా సిబ్బంది విధులకు ఇబ్బందిగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి నివేదిక పంపడం ద్వారా కొత్త భవనాలు మంజూరుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం పట్టణంలోని కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా మహారాణీ కళాశాల ఎదురుగా ఉన్న నీటి పారుదల శాఖకు చెందిన స్థలాన్ని కేటాయించడం జరిగిందని, ఈ స్థలంలో డివిజన్ స్థాయికి సంబందించిన కార్యాలయాలు, మండల పరిషత్, వాణిజ్య పన్నుల శాఖ, వ్యవసాయ శాఖ, తదితర కార్యాలయాలను నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే పెద్దాపురం మండలంలో రూ.1.26 కోట్లతో నూతనంగా పది అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని సామర్లకోట నుండి ఎడిబి రోడ్ వరకు రోడ్ విస్తరణలో భాగంగా విద్యుత్ కు సంబంధించి రూ. మూడు కోట్లు ఖర్చవుతుందని, వీటిలోరూ.1.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, అలాగే మరో రూ.1.50 కోట్లు సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు సమకూరుస్తాయన్నారు. అలాగే పట్టణంలో ఆరు ఎకరాల్లో స్టేడియం నిర్మాణానికి స్థలం సేకరించడం జరిగిందని హోం మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ధేందుకు అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఉపాధి హామీ  కూలిగా పనిచేసి ప్రమాదవశాత్తూ మరణించిన సిరివాడ  గ్రామానికి చెందిన మధుర మంగరాజు భార్య సూర్యకళకు రూ. 50 వేలు చెక్కును ఆయన చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమం లో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఎంపిపి గుడాల రమేష్, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, సామర్లకోట, పెద్దాపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు బొడ్డు బంగారు బాబు, అడబాల కుమారస్వామి, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, టిడిపి మండలాధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us