UPDATED 3rd JUNE 2018 SUNDAY 7:00 PM
పెద్దాపురం: రాష్ట్రంలో కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని జిల్లాల్లోను కాపు కళ్యాణ మండపాలను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక 13వ వార్డులో సుమారు కోటి రూపాయలతో నిర్మించ తలపెట్టిన కాపు కళ్యాణ మండపానికి, కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం భూమిపూజ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్రలో చెప్పిన విధంగా ఐదు శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపించామని, కాపు కార్పొరేషన్ ద్వారా అన్ని జిల్లాల్లో రూ. రెండు కోట్లుతో, అలాగే మండలాల్లో రూ. 50 లక్షలతో కాపు కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పెద్దాపురం పట్టణంలో కాపు కళ్యాణమండపం నిర్మాణానికి ఎంపి నిధులు రూ. 25 లక్షలు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు ద్వారా మంజూరు చేసిన రూ. 50 లక్షలతో ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని, మరో రూ. 25 లక్షలు నిధులు సమకూర్చడానికి కృషి చేస్తామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించడం జరిగిందని, ఇప్పటి వరకు మూడు బడ్జెట్లుకు రూ. మూడు వేల కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో రూ. రెండు వేల కోట్లు ఖర్చుకాగా, ఇంకా రూ. 1000 కోట్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. కాపులకు న్యాయం చేయాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు. కాపులకు రుణాలు, విదేశీ విద్యకు అవకాశాలు, కాపు కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్నామని, ఈ కళ్యాణ మండపం 2019 ఫిబ్రవరి నాటికల్లా పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపి నరసింహం మాట్లాడుతూ అన్ని కులాల వారికి కళ్యాణ మండపాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సామాన్యులకు అందుబాటులో తక్కువ సొమ్ముతో శుభకార్యాలు నిర్వహించడానికి ఈ కళ్యాణ మండపాలు ఎంతగానో దోహద పడతాయన్నారు. కాపుల సంక్షేమానికి, నిరుద్యోగులకు వ్యాపారపరమైన రుణాలు, విదేశాల్లో చదువుకు రిజర్వేషన్ కల్పించి కాపుకులస్తులను ముఖ్యమంత్రి అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. అనంతరం స్థానిక శతాబ్ది పార్కు వద్ద రూ. రెండు కోట్లుతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ ను మంత్రి, మున్సిపల్ చైర్మన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, సామర్లకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్లు బొడ్డు బంగారుబాబు, అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ప్రత్యేకాధికారి వి.కె. మల్లిఖార్జునరావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు( రాము), మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల సుబ్రహ్మణేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







