మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

UPDATED 22nd OCTOBER 2017 SUNDAY 9:00 PM

ప్రత్తిపాడు : తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి వేలాదిగా ప్రజలు  తరలివచ్చారు. అన్నిరకాల ఆరోగ్య సమస్యలకు పరీక్షలు, వైద్యసేవలు ఒకే చోట అందించేలా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఆప్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌ వరపుల రాజా తలపెట్టిన ఈ వైద్యశిబిరాన్నిరాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. జీజీహెచ్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యనిపుణులతో సహా సుమారు 270 మంది డాక్టర్లు సేవలందించారు. శిబిరానికి తీసుకొచ్చి ఇంటికి చేర్చేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంతో వేలాదిగా తరలివచ్చారు. చికిత్స చేయించుకోలేక పేదలు జబ్బు వాయిదా వేసుకొనే పరిస్థితి లేకుండా చేసేందుకే ఈ ప్రయత్నం చేశారని మంత్రి పుల్లారావు శిబిర నిర్వహణను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారని, ఈ క్రమంలో ఇలాంటి వైద్యశిబిరం నిర్వహించడం రాష్ట్రంలోనే తొలిసారి అని మంత్రి అన్నారు. నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండేలా కృషి అనుసరణీయమన్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్యసేవల్లోకి 100 రకాల జబ్బులను చేర్చిందని, రూ. 2.5 లక్షల చొప్పున వైద్యఖర్చులు భరిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఆరోగ్యసమస్యలున్నా కనీసం పరీక్షలు చేయించుకోలేని వారికి ఇలాంటి శిబిరాలు వరమేనన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి వేలాది మందికి ఒకే వేదికపై వైద్యం చేశారన్నారు. ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ నియోజకవర్గం అంతా ఆరోగ్యంగా ఉండాలన్న తపనతోనే ఈ ప్రయత్నం చేశామన్నారు. ఆప్కాబ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజా మాట్లాడుతూ వైద్యసేవలన్నీ అందుబాటులో ఉంచే ప్రయత్నం మున్ముందు జరుగుతుందన్నారు. శిబిరంలో 900 మంది ఉద్యోగులు, 2 వేల మంది కార్యకర్తలు, యువత స్వచ్ఛంద సేవలందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని కోటేశ్వరరావు, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల, జ్యోతుల నెహ్రూ, జడ్పీ ఛైర్మన్‌ నవీన్‌కుమార్‌, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి, డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రయ్య, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంటు రాఘవేంద్రరావు, ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ రామారావు, పర్వత రాజబాబు, గోకాడ రాంబాబు, కొమ్ముల కన్నబాబు, పర్వత సురేష్‌, గొంతిన సురేష్‌, గొల్లపల్లి బుజ్జి, బసా ప్రసాద్‌, వీరబాబు, ప్రభాకరరావు, గోపిరాజు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us