ప్రజా చైతన్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

UPDATED 18th APRIL 2018 WEDNEDAY 7:30 PM

పెద్దాపురం: ప్రజా చైతన్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామస్వరాజ్య అభియాన్ సభలో ఆయన బుధవారం పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం రావడం ద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, సమాజంలోని రుగ్మతలు తొలగినపుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా దేశమంతటా జరుపుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ స్వరాజ్య అభియాన్ పథకం ద్వారా జిల్లాలో 22 గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గానికి వాలు తిమ్మాపురం, ఉండూరు హెబిటేషన్ ఉన్నాయని, దీని ద్వారా నూరు శాతం ఈ గ్రామాల్లో దీపం పథకం ద్వారా గ్యాస్ పంపిణీ, చంద్రన్నబీమా పథకం, ఆరోగ్య కార్యక్రమాలు, ఎల్.ఇ.డి బల్బులు పంపిణీ, విద్యుత్ కనెక్షన్స్, హోసింగ్ మంజూరు, జన్ ధన్ అకౌంట్స్ ఉంటాయని, ఇవి పూర్తిస్థాయిలో అందరికీ అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్.సి కమ్యూనిటీకి హౌసింగు పథకం ద్వారా ఇళ్ళు నిర్మాణం, పిల్లలకు ఉచితంగా విద్య, విదేశీ విద్య అందచేస్తున్నామని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి చంద్రన్నకానుక క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఎస్.సి. కులస్తులకు రూ.40 వేలు వివాహం నిమిత్తం ఉచితంగా ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు. త్రాగునీరు, సిమ్మెంట్ రోడ్లు, డ్రైనేజీలకు ఈ గ్రామంలో నిధులు మంజూరు చేయించానని, పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. 75 యూనిట్లు వరకు ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ప్రజలందరు సహకరించుకుని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అనంతరం మంత్రి దీపం పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు లబ్దిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి.టి.సి సుందరపల్లి శివనాగరాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము), గుడా సభ్యుడు ఎలిశెట్టి నాని, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), గ్రామ సర్పంచ్ బచ్చల మరియమ్మ, ఎంపీడీవో పి. వసంతమాధవి, తహశీల్దార్ గోగుల వరహాలయ్య, సైనం సల్మాన్ రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us